Current Date: 10 Apr, 2026

అస్సాం, కేరళలో మొదలైన పోలింగ్.. గెలుపు ఎవరిదో?

అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 296 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో భాజపా-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా, 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. కేరళలోని 140 స్థానాలకు గానూ అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్, భాజపా కూటముల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇక్కడ సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో ఎన్డీయే, డీఎంకే-కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో అనేక మంది దిగ్గజాల భవిష్యత్తు తేలనుంది. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పట్టును నిలుపుకోవాలని చూస్తుండగా, కేరళలో పినరయి విజయన్ వరుసగా మూడోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. పుదుచ్చేరిలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నేడు జరుగుతున్న ఈ పోలింగ్ ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.