ఐపీఎల్-2026లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక పరుగు తేడాతో అసాధారణ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (70), వాషింగ్టన్ సుందర్ (55), జోస్ బట్లర్ (52) అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. దిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిశాంక (41) బలమైన ఆరంభాన్నిచ్చారు. 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన దిల్లీ సులభంగా గెలిచేలా కనిపించింది. అయితే ఈ దశలో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/17) తన మాయాజాలంతో నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్‌లను వరుసగా ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మరోవైపు రాహుల్ ఒంటరి పోరాటం చేసినా, భారీ రన్‌రేట్ ఒత్తిడిలో దిల్లీ వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో దిల్లీని మళ్ళీ రేసులోకి తెచ్చాడు. ఆఖరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో, మిల్లర్ ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా నిరాకరించాడు. చివరి బంతిని ఆడటంలో విఫలం కావడంతో పాటు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో కుల్దీప్ రనౌట్ అవ్వడంతో దిల్లీ 209 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది తొలి విజయం కాగా, దిల్లీకి ఈ సీజన్లో మొదటి ఓటమి ఎదురైంది.