Current Date: 10 Apr, 2026

పెద్ది ఐటెం సాంగ్‌ కోసం యంగ్ హీరోయిన్‌కు పిలుపు.. లక్కీ ఛాన్స్!

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ రెజ్లర్‌గా కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన రగ్గడ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒక సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదల తేదీలో స్వల్ప మార్పులు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నా, మేకర్స్ మాత్రం నిర్ణీత సమయానికే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉండే ఒక మాస్ స్పెషల్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం 'కపుల్ ఫ్రెండ్లీ', 'దేవకీ నందన వాసుదేవ' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి మానస వారణాసిని ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. చరణ్ లాంటి గొప్ప డ్యాన్సర్‌తో మానస స్టెప్పులేయడం ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.