ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరై వస్తూ దారిలో దొంగతనానికి పాల్పడ్డ ఒక గజదొంగను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన మిక్కిలి శ్యాం రిచర్డ్ అలియాస్ వంశీకృష్ణ (43), హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివసిస్తూ ఆన్లైన్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. తన జల్సాల కోసం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ఇతనిపై ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో మొత్తం 62 కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి 21న ఖమ్మం కోర్టులో విచారణకు హాజరై కారులో హైదరాబాద్ వస్తున్న నిందితుడు, రాత్రి సమయంలో చౌటుప్పల్లో లింగంపల్లి నర్సింహ అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డాడు. బీరువాలో ఉన్న రూ.14.20 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనా స్థలంలో సంచరించిన వాహనాల నంబర్లను విశ్లేషించి, నిందితుడు సెల్ఫ్ డ్రైవ్ కారులో వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తాజాగా విజయవాడ హైవేపై నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, కారు, ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్న శ్యాం రిచర్డ్, మిగిలిన డబ్బును గోవాలోని క్యాసినోలో ఖర్చు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. ఇతనిపై ఒక్క ఖమ్మం జిల్లాలోనే 20 కేసులు ఉండటం గమనార్హం.