బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద గత వారం నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయి.. బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు.
కవితకి ఇద్దరు కుమారులుకాగా.. చిన్న కుమారుడికి త్వరలోనే పరీక్షలు ఉన్నాయి. ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలు పక్కన ఉండాలని.. అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తన పిటీషన్‌లో పేర్కొన్నారు. కానీ ఈడీ మాత్రం కౌంటర్ దాఖలు చేస్తోంది. కవిత సమాజంలో పలుకుబడి ఉన్న రాజకీయ నేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరుతోంది.
మార్చి 15న హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఆ తర్వాత 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టుని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మూడు రోజులు పెంచింది. ఆపై ఈడీ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పెంచింది.