Current Date: 30 Aug, 2026

దర్శకుడు రాఘవేంద్రరావుని మళ్లీ టార్గెట్ చేసిన హీరోయిన్ తాప్సీ!

హీరోయిన్ తాప్సి పన్ను తన తొలి చిత్రం 'ఝుమ్మంది నాదం' సెట్‌లోని చేదు అనుభవాలను మరోసారి గుర్తుచేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సెట్‌లో ఏకైక మహిళ అయిన తనకు కనీస గౌరవం దక్కలేదని, ఎలాంటి సదుపాయాలు లేక ఓ మూలన ప్లాస్టిక్ కుర్చీలోనే కూర్చోవాల్సి వచ్చిందని దర్శకుడు రాఘవేంద్రరావుని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఉద్దేశించి "హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు వేసే ఆయన.. నాపై ఏకంగా కొబ్బరికాయ వేశారు" అంటూ తాప్సి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొత్తదానిని కావడంతో నాటి పరిస్థితులు అలాగే ఉంటాయనుకున్నానని, అయితే తర్వాత చేసిన ఏ సినిమా సెట్‌లోనూ అలాంటి వాతావరణం ఎదురుకాలేదని స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ ప్రవర్తన కూడా తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేసిందని తాప్సి ఆవేదన వ్యక్తం చేశారు. సెట్‌లో ఉన్నవారు తనను దూరం పెట్టారని, మాట్లాడేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. నేలపై పడుకుని చేసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలో కెమెరామెన్, ఫోకస్ పుల్లర్లు ట్రాలీలపై కూర్చుని కొంత అసభ్యకరంగా వ్యవహరించారని, అది ఇతరులకు ఎంతటి ఇబ్బంది కలిగిస్తుందో అనే స్పృహ కూడా వారికి లేకపోవడం బాధాకరమని అన్నారు.