Current Date: 30 Aug, 2026

అమెరికాలో మర్డర్ చేసి.. చిన్న తప్పుతో ఆగ్రాలో దొరికిపోయిన భారతీయుడు!

అమెరికాలో జరిగిన ఓ ఘోర హత్య కేసులో ఎనిమిది నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు అర్జున్‌శర్మ ఎట్టకేలకు ఒక చిన్న పొరపాటుతో దొరికిపోయాడు. హైదరాబాద్ లాలాగూడకు చెందిన నిఖిత 2022లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లగా, చెన్నైకి చెందిన అర్జున్‌శర్మతో పరిచయం ఏర్పడింది. అయితే 2024లో తన ఉద్యోగం పోయిందని నమ్మించిన అర్జున్, నిఖిత వద్ద భారీగా డబ్బులు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత బాకీ తీరుస్తానని నమ్మించి 2025 డిసెంబర్ చివరి వారంలో కొలంబియాలోని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించి, ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం ఏమీ ఎరగనట్లు ఈ ఏడాది జనవరి 1న నిఖిత కనిపించడం లేదంటూ మేరీల్యాండ్ పోలీసులకే ఫిర్యాదు చేసి పక్కా ప్లాన్‌తో భారత్‌కు వచ్చేశాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి జనవరి 3న అతడి గదిని తనిఖీ చేయగా నిఖిత మృతదేహం లభ్యమైంది. అప్పటినుంచి పరారీలో ఉన్న అర్జున్‌శర్మ కోసం గాలిస్తున్న వేళ.. అతడు చేసిన ఒక చిన్న తప్పు పోలీసులకు చిక్కేలా చేసింది. దారుణానికి ఒడిగట్టిన నిందితుడు, మృతురాలు నిఖిత బ్యాంకు ఖాతాలోని డబ్బును తన ఖాతాలోకి బదిలీ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ డిజిటల్ లావాదేవీల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో అతడి లొకేషన్‌ను ట్రాక్ చేశారు. ఆగ్రాలో దాక్కున్నట్లు పక్కా సమాచారం సేకరించి దాడులు చేసి అతడిని కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణ హత్య వెనుక ఉన్న నిజాలను, అర్జున్‌శర్మ అరెస్టుకు సంబంధించిన సంచలన వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అధికారికంగా వెల్లడించారు.