విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం ఫెర్రో అల్లాయ్స్ కొనుగోలు కారణంగా యాజమాన్యానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లలో జరిగిన ఫెర్రో అల్లాయ్స్ కొనుగోళ్లపై కాగ్, సీవీసీలచే తక్షణమే సమగ్ర ఆడిట్ నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన సరఫరాదారుతో పాటు బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్లాంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ప్లాంట్‌లో జరిగిన ఎస్ఎమ్ఎస్ విభాగం ప్రమాద విచారణలో భాగంగా ఈ నాసిరకం మెటీరియల్ వ్యవహారం బయటపడింది. సాధారణంగా ఒక హీట్ స్టీల్ తయారీకి 1.2 టన్నుల ఫెర్రో అల్లాయ్స్ అవసరం కాగా, జూన్ మొదటి వారంలో అది ఏకంగా 2.4 నుండి 2.6 టన్నులకు పెరిగిందని యూనియన్లు ఆరోపించాయి. ప్లాంట్ అంతర్గత నాణ్యతా పరీక్షల్లో ఆ మెటీరియల్‌లో కేవలం 30 శాతం మాత్రమే అసలైన ఫెర్రో అల్లాయ్ ఉందని, మిగిలినదంతా ఆక్సైడ్లు, తేమతో నిండి ఉందని తేలింది. తదనంతరం సెయిల్ వంటి ఇతర సంస్థల నుండి మెటీరియల్ సేకరించినప్పుడు వినియోగం మళ్లీ సాధారణ స్థాయికి తగ్గడం ఈ అక్రమాలను బలపరుస్తోంది. cఈ అసాధారణ వినియోగం వల్ల స్టీల్ తయారీకి నేరుగా అయ్యే వ్యయం ప్రతి హీట్‌కు రూ. 1.5 లక్షల నుండి రూ. 3 లక్షలకు పెరిగి రెట్టింపైంది. దీనికి తోడు అదనపు విద్యుత్ వినియోగం, ప్లాంట్ వ్యర్థాలు పెరగడం, ఉత్పత్తి నష్టాలను లెక్కడితే ఆర్ఐఎన్ఎల్కు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున వినియోగం పెరుగుతున్నా క్వాలిటీ కంట్రోల్, పర్చైజ్, ఫైనాన్స్ విభాగాలు బిల్లులను ఎలా క్లియర్ చేశాయని, కనీస హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదనే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ కుంభకోణంపై ప్లాంట్ ఉన్నత యాజమాన్యమైన డైరెక్టర్ (కమర్షియల్), డైరెక్టర్ (ఫైనాన్స్), డైరెక్టర్ (ఆపరేషన్స్), సిఎండిల బాధ్యతపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. గత ఐదేళ్ల కొనుగోళ్లపై సీఏజీ, సీవీసీ విచారణ జరిపించడంతో పాటు, సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కీలక ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే జవాబుదారీతనం దిగువ స్థాయి ఉద్యోగుల నుండి కాకుండా అగ్ర నాయకత్వం నుంచే ప్రారంభం కావాలి.