Current Date: 25 Nov, 2024

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ఓటమి ఖాయమంటున్న పీకే

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా ఓడిపోనుందని తేల్చిచెప్పారు. అదే సమయంలో పరోక్షంగా జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో మునిగితేలుతున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యారు. 2019లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే ఆ తరువాత తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పనిచేశారు. ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు నెలరోజులు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలవడంతో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం హీటెక్కింది. అక్కడ్నించి ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పనిచేస్తున్న ఐ ప్యాక్ టీమ్ కూడా ప్రశాంత్ కిశోర్‌తో తమకు సంబంధం లేదని వెల్లడించింది.

ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో అధికార పార్టీ ఓడిపోతోందని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, వైసీపీ అధికారంలో రాదని తేల్చిచెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ బర్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మరోవైపు ఈసారి కచ్చితంగా 151 సీట్లు దాటుతామని చెప్పిన వైఎస్ జగన్ దీమాపై పరోక్షంగా స్పందించారు. రాజకీయ నేతలెవరూ ఓటమిని చివరి వరకూ అంగీకరించరని చెప్పారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఓడిపోతున్నామని తెలిసి కూడా గెలుస్తామంటూ చెబుతారని చెప్పుకొచ్చారు.

మొత్తానికి ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఏపీలో మరోసారి సంచలనం రేపుతున్నాయి. అధికార పార్టీ ధీమాకు చెక్ పెడుతున్నాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పనిచేసిన ఆయన పాత టీమ్ ఐ ప్యాక్ నుంచి ఏమైన ఉప్పందిందా లేక జోస్యం చెబుతున్నారా అనేది తెలియడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పీకేకు సొంత సర్వే టీమ్స్ ఏవీ లేవు.