అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ మూలాలున్న కమలా హారిస్ మరోసారి నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలి., వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. డెమొక్రాట్ల సీనియర్ల నుంచి అతనిపై ఒత్తిడి పెరగగా.. వారందరి మద్దతు అనూహ్యంగా కమలా హారిస్‌కే లభిస్తోంది. కమలా హారిస్ భారత సంతతికి చెందిన మహిళ. కాలిఫోర్నియాలోని జమైకా-అమెరికన్ ప్రొఫెసర్ డోనాల్డ్ జె హారిస్, తమిళ జీవశాస్త్రవేత్త శ్యామాల గోపాలన్ దంపతులకు ఆమె 1964 అక్టోబర్ 20న జన్మించారు. అయితే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అనంతరం కమలా తన తల్లితో కలిసి జీవిస్తున్నారు. కమలా హారిస్ పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. 2007లో జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఒకసారి, 2014లో మరోసారి అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు. 2017లో ఆమె తన స్వరాష్ట్రం నుంచి జూనియర్ యూఎస్ సెనేటర్ అయ్యారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హారిస్, జో బైడెన్‌కు మద్దతుగా రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన పాలనలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగుతున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న ఈవెంట్‌లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ నామినేషన్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే, దేశానికి మొదటి భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు కాగలరు.
Share