Current Date: 06 Oct, 2024

దొంగ రిజిస్ట్రేషన్లను రద్దు చేయండి

సాగులో ఉన్న భూముల్ని అధికారులు దొంగ లెక్కలు రాసి జిరాయితీ చేసేశారని, భూ మాఫియాతో కుమ్మక్కై రికార్డులు మార్చేశారని, అయినా అధికారులపై ఎలాంటి చర్యల్లేవని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలోని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనాం శివారు కొత్తవీధి కొందు పీవీటీజీ ఆదివాసీలు తామెదుర్కొన్న సమస్యల్ని డీఐజీ దృష్టికి తీసుకు వెళ్లారు. కోనాం గ్రామంలోని సర్వే నంబర్‌ 289/1ఏలో 8 ఎకరాల సీలింగ్‌ మిగులు భూముల్ని కలుపుకొని, 37ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేశారని, అప్పటి చిడికాడ తహసీల్డార్‌, మాడుగుల సబ్‌ రిజిస్ట్రార్‌ భూ మాఫియాతో చేతులు కలిపి, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌ ఆస్తిగా చూపించారని ఆరోపించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం, జాతీయ కార్యదర్శి పీఎస్‌ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ, నిషేధపు ఉత్తర్వుల పుస్తకంలో ఉన్నప్పటికీ అధికారులు కుమ్మక్కై రూ.50లక్షల విలువైన భూముల వివరాల్ని ఐదు రిజిస్ట్రేషన్ల ద్వారా రికార్డుల్లో మార్చేశారని స్పష్టం చేశారు. సాగులో ఉన్న ఆదివాసీలు ఇదే విషయమై విజయవాడలోని రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదిచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాలపై జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారి విచారణ జరిపారని, అక్రమాలు బయట పడినప్పటికీ నేటికీ దస్తావేజులు రద్దు చేయడం గాని, అధికారులపై చర్యలు చేపట్టలేదన్నారు. జూలై 2023లోనే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్‌ ఆదేశాలిచ్చినప్పటికీ 11నెలలు గడుస్తున్నా చర్యల్లేవన్నారు. చర్యల్లేకపోతే భూ మాఫియా  సదరు భూముల్ని విక్రయించేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా చర్యలు చేపట్టాలన్నారు.  తీసుకోవాలని అజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివాసీల సాగుకు, వారి హక్కులకు రక్షణ కల్పించాలని అజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Share