Current Date: 18 Jul, 2026

రక్తపు మడుగులో భర్త, కుమారుడు..పక్క గదిలో రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్!

కర్ణాటకలోని ధార్వాడ్‌లో జరిగిన ప్రైవేట్ ఆసుపత్రి అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ హత్య కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘోరం జరిగిన సమయంలో ఆయన భార్య, నేత్ర వైద్యురాలు అయిన డాక్టర్ ప్రియాంక కటానహళ్లి ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన భర్త రక్తపు మడుగులో శవమై పడి ఉండగా, ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా ఆమె మాత్రం మంచంపై ప్రశాంతంగా కూర్చుని మొబైల్ ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్న వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. డాక్టర్ కిరణ్ బంధువులు, స్నేహితులు ఆయనకు ఫోన్ చేయగా.. ప్రియాంకనే ఫోన్లు ఎత్తి ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పింది. మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లాడని నమ్మబలికింది. అయితే అనుమానం వచ్చిన బంధువులు ఫ్లాట్‌కు వచ్చి చూడగా, రక్తసిక్తమైన దృశ్యం చూసి హతాశయులయ్యారు. అప్పటికే డాక్టర్ కిరణ్ చనిపోగా, తీవ్ర గాయాలతో ఉన్న బాలుడు కొన ఊపిరి ఉండటాన్ని గుర్తించిన పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ స్వయంగా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతుడి భర్త, కుమారుడు పడి ఉన్న గది పక్కనే ప్రియాంక ఏమాత్రం చలనం లేకుండా మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రూరమైన దాడికి ఆమే పాల్పడి ఉండవచ్చని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.