Current Date: 17 Jul, 2026

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. భక్తులు ఉక్కిరిబిక్కిరి

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ వార్షిక రథయాత్ర ప్రారంభమైన తరుణంలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రథయాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్ వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెరిగిన భక్తజన సందోహం కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో  ఒక వృద్ధ భక్తుడు మరణించగా, వంద మందికి పైగా భక్తులు స్పృహతప్పి పడిపోయారు. అధికారులు మాత్రం పూరీలో ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేశారు. కేవలం తాత్కాలికంగా జనం ఒక్కసారిగా పెరగడం వల్లే ఏడుగురు భక్తులు అస్వస్థతకు గురయ్యారని, వారికి తక్షణమే ఆసుపత్రిలో చికిత్స అందించామని తెలిపారు. మరణించిన 60 ఏళ్లు పైబడిన వ్యక్తి మృతికి గల ఖచ్చితమైన కారణాలను వైద్య బృందం నిర్ధారిస్తోందని చెప్పారు. ఈ దుర్ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. గత ఏడాది  రథయాత్ర సమయంలో కూడా గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే.