Current Date: 08 Feb, 2026

భారత్‌ కొంప ముంచిన ఒక్క రనౌట్.. కివీస్ చేతిలో ఓటమి

విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు, 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా కివీస్ జట్టు 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో తొలి గెలుపును నమోదు చేసింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (62), డెవాన్ కాన్వే (44) మెరుపు ఇన్నింగ్స్‌లతో తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. చివర్లో డరైల్ మిచెల్ (39 నాటౌట్) మెరుపులు తోడవడంతో కివీస్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసినా, పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా, కెప్టెన్ సూర్యకుమార్ (8), హార్దిక్ పాండ్యా (2) కూడా నిరాశపరిచారు. అయితే శివమ్ దూబే (23 బంతుల్లో 65; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత ఇన్నింగ్స్‌లో ఆశలు రేపాడు. దురదృష్టవశాత్తూ దూబే రనౌట్ కావడంతో భారత పోరాటం ముగిసింది. కివీస్ కెప్టెన్ సాంట్నర్ మూడు వికెట్లతో భారత్‌ను దెబ్బతీశారు. చివరి మ్యాచ్ శనివారం తిరువనంతపురంలో జరగనుంది.