తనపై దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా, ప్రధాన మీడియా సంస్థలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బిగ్ షాక్ ఇచ్చారు. తన విడాకులపై, తన కుటుంబంపై అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసేలా ఉన్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులను, వీడియోలు డిలీట్ చేయాలని రెహమాన్ డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా తనపై జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా మొత్తం తొలగించకపోతే భారతీయ న్యాయ సంహితలోని 356 సెక్షన్ కింద పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరిస్తూ ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాది బహిరంగ నోటీసులు విడుదల చేశారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని సైతం పేర్కొన్నా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. తన క్లైయింట్కు సంబంధించి యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఇతర ఆన్ లైన్ సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో చేసిన అసత్యప్రచారానికి సంబంధించి మొత్తం కంటెంట్ తొలగించాలని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసులో పేర్కొన్నారు.