తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘించిన హీరోయిన్‌కు అటవీశాఖ షాక్ ఇచ్చింది. ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక ఉన్న 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరిపైకి వెళ్లడంపై అటవీశాఖ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సాధారణంగా భక్తులు కేవలం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మాత్రమే చేస్తారు. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రముఖ నటి అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్ కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లిన అనంతరం అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను అర్చన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు భక్తులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సెలబ్రిటీ హోదాలో ఉండి నిబంధనలు అతిక్రమించడంపై అటవీశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, అనుమతి లేకుండా రక్షిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినందుకు గానూ అర్చనా రవిచంద్రన్, అరుణ్ ప్రసాద్‌లకు చెరో రూ. 5,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతం కాకూడదని వారిని గట్టిగా హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, భద్రతా కారణాల దృష్ట్యా కొండ ఎక్కడంపై నిషేధం ఉందని అధికారులు స్పష్టం చేశారు.