Current Date: 07 Oct, 2024

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ?

 ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, ఇసుక పాలసీ జీవోకు  ఏపీ క్యాబినెట్‌  ఆమోదం తెలిపింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.  నాలుగు అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, ఇసుక పాలసీ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలపై చర్చించి ఆమోదించారు. మరో 15 రోజుల్లోగా ఇసుక కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.  తల్లికి వందనం, ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన గైడ్‌ లైన్స్‌పై చర్చించారు.  కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆగస్టు1 తేదీ నుంచి రెండు నెలల కాలానికి గాను బడ్జెట్‌ పొడిగింపు ఆర్డినెన్సుకు క్యాబినెట్‌ ఆమోదం తెలియజేసింది. మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విధివిధానాలపైనా చర్చించినట్టు తెలిసింది.  అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చించారు. ఈ నెల 22 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల పైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Share