ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. తీహార్ జైలు అధికారులు నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు. కాగా.. మద్యం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్టు చేశారు. ఈ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న, కవితతో పాటు చరణ్‌ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.అయితే.. కవిత, చరణ్ ప్రీత్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున.. వారికి కోర్టు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లు జూన్ 3న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా జూన్ 3తో ముగియనుంది.