ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తన భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత రెండేళ్లుగా తీవ్ర నొప్పితో అవస్థలు పడుతున్న తోటమళ్ల నాగభూషణం, తన బాధను చూడలేక పలుమార్లు ఆత్మహత్యకు యత్నించగా, భార్య జయమ్మ ప్రతిసారీ ఆయన్ని కాపాడుతూ వచ్చారు. తన భార్య ఉన్నంత వరకు తనను చావనివ్వదని భావించిన నాగభూషణం, అర్ధరాత్రి నిద్రపోతున్న జయమ్మపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నాగభూషణం మరణించారు. తీవ్రంగా గాయపడిన జయమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, అందరికీ వివాహాలయ్యాయి. నాగభూషణం తాపీ పని చేస్తూ, జయమ్మ కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. అనారోగ్యం కారణంగా పెరిగిన మానసిక వేదన చివరకు ఇలాంటి దారుణానికి దారితీయడం స్థానికంగా కలచివేసింది.