Current Date: 27 Nov, 2024

మీడియా పై రజనీకాంత్ కేసు

ప్రముఖ న్యూస్ యాంకర్, టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్ రజినీకాంత్ కొన్ని డిజిటల్ మీడియా వేదికలు, సోషల్ మీడియా గ్రూపులపై ఇవాళ క్రిమినల్ కేసు నమోదు చేశారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ తన ఇమేజ్ పాడు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.టీవీ9 రజనీకాంత్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 469, సెక్షన్ 505 (1)(C) ప్రకారం కేసు నమోదు చేశారు. వీటిలో సెక్షన్ 469 అంటే ఒకరిని అపఖ్యాతి చేసే విధంగా ఫోర్జరీ చేయడం, సెక్షన్ 505 అంటే ఒకరిపై విద్వేషం వెదజల్లేలా వార్తలు ప్రచారం చేయడం. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఫేక్ వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రజనీకాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో ఆయన కొన్ని తెలుగు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు, వాట్సప్-ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్ని ఉదహరించారు.రజినీకాంత్ ఆస్థులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని, దాంతో అతని వ్యాపార భాగస్వామి ఎరేంజ్ చేసిన ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీకు వెళ్లాడని గత రెండ్రోజులుగా ఈ తెలుగు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలోనే అత్యంత ధనికుడైన జర్నలిస్ట్ రజనీకాంత్ అని ఈ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, అమరావతిలో రజనీకాంత్‌కు ఆస్థులున్నాయని, వైసీపీ నేతలతో వ్యాపార సంబంధాలున్నాయని కూడా ఈ మీడియా గ్రూపుల్లో వార్తలు వచ్చాయి.

Share