సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. తిలక్ వర్మ సెంచరీ సాయంతో టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ 41 పరుగులు, మార్కో యన్‌సెన్ 54 రన్స్ తో రాణించారు. అయినప్పటికీ భారత బౌలర్లు మ్యాచ్‌ను చేజారనివ్వలేదు. సమష్టి ప్రదర్శనతో భారత్‌ను విజేతగా నిలిపారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Share