Current Date: 27 Nov, 2024

వాలంటీర్లు ఉంటారా ? సీఎం చంద్రబాబు క్లారిటీ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి వాలంటీర్ వ్యవస్థ గురించి సీఎం చంద్రబాబు పెదవి విప్పారు. సాంఘిక సంక్షేమ శాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని  వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు అధికారులను సీఎం ఆదేశించారు. మాజీ సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నెలకి రూ.10వేలు జీతం కూడా ఇస్తానన్నారు. కానీ  గెలిచిన తర్వాత వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయిస్తుండటంతో వాలంటీర్ల కథ ముగిసినట్లేనని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా చంద్రబాబు మాటలతో మళ్లీ వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ తెరపైకి వచ్చింది.

Share