ఐపీఎల్ 2024లో కొత్త హీరోలు వెలుగులోకి వస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత ఆటకు.. ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31) పోరాటం తోడు కావడంతో.. బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ ఐపీఎల్ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో పంజాబ్ కింగ్స్ ‘పొరబాటున’ శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆ పొరబాటే ఇప్పుడు పంజాబ్ పాలిట వరంగా మారింది.
ఐపీఎల్ 2024 వేలంలో శశాంక్ సింగ్ పేరుతో ఉన్న మరో ప్లేయర్‌ను కొనుగోలు చేయబోయి పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. రూ.20 లక్షల బేసిక్ ప్రైస్‌కే అతణ్ని సొంతం చేసుకుంది. అయితే తాము పొరబాటున వేరే ఆటగాణ్ని కొనుగోలు చేశామని గ్రహించిన పంజాబ్ కింగ్స్ నాలుక కరుచుకుంది.
వేలం సమయంలో పంజాబ్ ఓనర్స్ నెస్ వాడియా, సంజయ్ బంగర్ తాము పొరబాటున బిడ్ వేశామన్నట్టుగా ఏదో చర్చించుకోవడం కనిపించింది. దీంతో ఆక్షనీర్ మల్లికా సాగర్ కలుగజేసుకొని మీరు కొనాలనుకుంది ఇతడు కాదా..? ఈ ప్లేయర్ మీకొద్దా? అని ప్రశ్నించారు. అయితే ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం వేలంలో ఓసారి ఆటగాణ్ని కొనుగోలు చేశాక.. అతణ్ని వద్దని చెప్పడం కుదరదు. దీంతో పంజాబ్ కింగ్స్ సైలెంట్ అయిపోయింది. గుజరాత్‌పై అతనే ఒంటరి పోరాటంతో జట్టుని గెలిపించి హీరోలా మారిపోయాడు.