ఐపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్ కథ శుక్రవారం రాత్రి ముగిసిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబయి టీమ్ ఓడిపోయింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో ముంబయి టీమ్ 6 వికెట్ల నష్టానికి 196 పరుగులే చేయగలిగింది. సీజన్‌లో లాస్ట్ మ్యాచ్ ఆడిన ముంబయి.. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైపోయింది.
లక్నో టీమ్‌లో నికోలస్ పూరన్ 29 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 75 పరుగులు చేయగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా 55 రన్స్ చేశాడు. మరోవైపు ముంబయి టీమ్‌లో రోహిత్ శర్మ 68 పరుగులు చేసినా.. అతనికి ఎవరూ సపోర్ట్ చేయలేకపోయారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 13 బంతులాడి 16 పరుగులే చేసి కీలక సమయంలో ఔటైపోయాడు. దాంతో ముంబయికి ఓటమి తప్పలేదు.
సీజన్‌లో లాస్ట్ మ్యాచ్ ఆడిన లక్నో టీమ్ గెలుపొందినా.. 14 పాయింట్లతో ఆరో స్థానానికే పరిమితమైంది. ఆ జట్టు 14 మ్యాచ్‌లాడి గెలిచింది ఏడింటిలోనే. మరోవైపు ముంబయి 14 మ్యాచ్‌లాడి ఏకంగా 10 మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది.