విశాఖలోని వేపగుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని సినీ నటులు జీవిత, రాజశేఖర్ ఇంట్లో పని చేస్తోంది. ఇదిలా ఉంటే కొత్తవలస దరి సూరివలస ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా అక్కడ చేరి కొన్నాళ్లపాటు కారు డ్రైవర్‌గా పని చేశారు. వాస్తవానికి అప్పటికే ఆ మహిళకు పెళ్లయి భర్తతో విబేధాలు రావడంతో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో సదరు మహిళకు, సూరివలస వ్యక్తి మభ్యపెట్టాడు. ప్రేమ నటించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆయనతో చనువు పెరగడంతో ఓ దశలో ఆమె తన బంగారాన్ని సైతం అమ్మేసి సదరు వ్యక్తికి ఇచ్చింది. ఖరీదైన ఫొన్ కొనుక్కుంటానంటే డబ్బులిచ్చింది. ఆమెను పెళ్లి చేసుకుని, రూ.15లక్షల వరకు ఆమె నుంచి తీసుకుని ఆపై పరారైపోయాడు. ఈ క్రమంలో తనకు జరిగిన మోసాన్ని జీవిత, రాజశేఖర్‌కు వివరించగా, ఆమెతో పెందుర్తి పోలీసులకు వారు ఫిర్యాదు చేయించారు. పెళ్లి పేరిట నమ్మించి, భారీగా డబ్బు కాజేసి తమింట్లో మనిషికి మోసం చేసిన ఆ వ్యక్తికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
Share