Current Date: 26 Nov, 2024

Gill, Sudharsan centuries fire Gujarat Titans to win over CSK

ఐపీఎల్ 2024లో అరుదైన రికార్డ్ నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ శతకాలు బాదేశారు. సుదర్శన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 103 పరుగులు చేయగా.. శుభమన్ గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఇద్దరూ ఒకే సమయంలో సెంచరీలు బాది.. ఒకే ఓవర్‌లో ఔటైపోవడం గమనార్హం.

ఓపెనర్లు సెంచరీలు చేయడంతో గుజరాత్ టీమ్ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఇద్దరూ చెరొక పరుగు చేసి ఔటైపోవడం యాదృశ్చికం. అజింక్య రహానె, రచిన్ రవీంద్ర ఒక్కో పరుగు చేసి ఔటవగా.. రుతురాజ్ గైక్వాడ్ డకౌటయ్యాడు. దాంతో ఆరంభంలోనే ఒత్తిడిలోకి వెళ్లిపోయిన చెన్నై టీమ్ చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులే చేయగలిగింది.

పాయింట్ల పట్టికలో ఆరంభంలో టాప్‌లో ఉన్న చెన్నై టీమ్.. ప్లేఆఫ్స్ ముంగిట రోజు రోజుకి దిగజారిపోతోంది. ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన చెన్నై టీమ్.. ఆరు మ్యాచ్‌లే గెలిచింది. దాంతో ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గుజరాత్ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది.