విశాఖపట్నం, న్సూనలీడర్, మే 28: ఇల్లొదిలి ఊరెళ్తున్నవారికి విశాఖ పోలీసులు భరోసా ఇస్తున్నారు. ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ (లాక్డ్ హౌస్ మానటిరింగ్ సిస్టం) ద్వారా దొంగల ఆట కట్టించొచ్చని సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ తెరిచి ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటున్నారు. ఇంట్లోని వ్యక్తులు పూర్తి వివరాల్ని పొందుపరిస్తే పోలీసులే మీ ఇంటికొచ్చి సీసీ కెమెరాలు అమర్చుతారంటున్నారు. తద్వారా నేరాలు అదుపులోకి వస్తాయంటున్నారు. ఇదిలా ఉంటే స్టీల్‌ప్లాంట్ సెక్టార్-11కు చెందిన ఓ వక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లి, సంబంధిత వివరాల్ని స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సౌత్ క్రైం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, స్టీల్‌ప్లాంట్ క్రైం ఎస్‌ఐ టి. రుక్మాంగదరావు సీసీ కెమెరాల్ని అమర్చారు. సీసీ కెమెరాను పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించడం ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని, సంబంధిత ఇళ్లలో అనుమానాస్పద వక్తులు ప్రవేశిస్తే కంట్రోల్ రూంలో అలారం కూడా మోగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. తద్వారా దొంగల్ని పట్టుకునే అవకాశముందన్నారు. అదే విధంగా నగర ప్రజలు కూడా సీసీ కెమెరాల్ని అన్ని చోట్లా అమర్చుకుంటే నేరాల్ని అరికట్టవచ్చని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.