ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న తరహా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రజలతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 1995 -2004 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో చంద్రబాబు నాయుడు ‘డయల్ యువర్ సీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజలు నేరుగా సీఎంకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించేవారు. సంక్రాంతి నుంచి ఏపీలో మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో గానీ, వీడియో విధానంలో గానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.