Current Date: 07 Oct, 2024

మళ్లీ తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది  గురువారం మరోసారి తెరుచుకుంది. పండితుల సూచనమేరకు  ఉదయం 9.51కి శుభముహూర్తాన గది తాళాలు తెరిచి లోపలికి ప్రవేశించారు. 12వ శతాబ్దానికి చెందిన  పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని   ఈ నెల 14న తెరిచి 2 గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఆదివారం రత్న భాండాగారం తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే గదిని మూసేశారు. గదిలోని పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గురవారం మరో సారి రహస్యగదిని తెరిచి ఆభరణాలను వేరే చోటుకు తరలించారు. సంపదను స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచి.. ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగించనున్నట్లు భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌, ఆలయ పాలనాధికారి అరవింద పాఢ తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యాక సంపదను మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతారు. మరోవైపు రహస్య గది తెరుస్తున్నందున శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచే భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 

Share