Current Date: 06 Jul, 2024

తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మెనూ ఇదే.. కోర్టు పర్మీషన్ ఇచ్చినా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో నిందితురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 9 వరకు తీహార్​ జైల్లోనే ఉండనున్నారు. ఆమెకు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​ విధించింది. కవిత తీహార్ జైలుకు వెళ్లి ఒకరోజు గడిచిపోయింది. జైలులోని 6వ నంబర్ విభాగంలో కవిత ఉంటున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళా ఖైదీలు కూడా అదే సెల్‌లో ఉన్నారు.

ఉదయం కవిత స్నాక్స్‌ తిని, టీ తాగారు. నిన్న రాత్రి అన్నం, పప్పుతో భోజనం చేశారని తెలుస్తోంది. ఈక్రమంలో తనతో పాటు జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా కవిత ఆహారం వడ్డించారట. జైలులో మొదటిరోజు బుక్స్ చదివేందుకు కవిత ప్రయత్నించారట. టీవీని చూస్తూ కూర్చున్నారట. టీ, ఆహారం, టీవీ చూసే టైమింగ్స్‌ను ఇతర ఖైదీల మాదిరిగానే కవితకు కూడా అమలు చేశామని తీహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమకు కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులేవీ డిమాండ్ చేయలేదని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను, సౌకర్యాలను అందజేస్తామని స్పష్టం చేశారు.

తీహార్ జైలులో ఉంటున్న కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. జైలుకు ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు.. మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను సొంతంగా ఏర్పాటు చేయించుకునేందుకు న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. పెన్ను, పేపర్లు, మందులను తనతో పాటు జైలులోకి తీసుకెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.