Current Date: 27 Nov, 2024

అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు బెయిల్‌పై హైకోర్టు స్టే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ లభించిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రాస్ ఎవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ కాస్సేపట్లో విడుదల కావల్సి ఉండగా ఢిల్లీ  హైకోర్టు నుంచి షాక్ తగిలింది. మద్యం కేసులో దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం తెలిపింది. బెయిల్ నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై విచారణ జరిపేంతవరకూ అరవింద్ కేజ్రీవాల్ విడుదల నిలిపివేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో అరవింద్ కేజ్రీవాల్ విడుదల ఆగిపోయింది.వాస్తవానికి లక్ష రూపాయల వ్యక్తిగత బాండుపై రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన రాస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి..హైకోర్టులో అప్పీలుకు వీలుగా 48 గంటలు తీర్పు నిలిపివేయాలన్న ఈడీ అభ్యర్ధనను తోసిపుచ్చారు. దాంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌పై స్టే తెచ్చుకుంది.

Share