Current Date: 26 Nov, 2024

విశాఖ ఉక్కు వద్ద మళ్లీ ఉద్రిక్తత కాంట్రాక్ట్‌ కార్మికుల నిరసన ఈడీ వర్క్స్‌ బిల్డింగ్‌ ముట్టడి

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద మంగళవారం మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్‌ కార్మికులు ఈడీ వర్క్స్‌ బిల్డింగ్‌ను ముట్టడిరచారు. తమకు న్యాయం చేయాలంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ వద్దకు భారీగా పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో పాటు ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. కాగా, 4200 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు తొలగింపు ప్రక్రియపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే స్టీల్‌ప్లాంట్‌ బీసీ గేట్‌ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్‌ కార్మికుల్ని తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కు తగ్గిందని తెలిసింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలుండొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

Share