Current Date: 06 Jul, 2024

భీమవరంలో గ్లాస్‌కి వేద్దామనుకుంటే.. ఫ్యాన్‌కి పడిన పెద్దాయన ఓటు!

ఏపీలో ఎన్నికల సిత్రాలు మామూలుగా లేవు. పోలింగ్ రోజున పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో ఓ ఓటర్ ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. తనతో బలవంతంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఓటు తనకు కావాలని.. తాను మళ్లీ ఓటేస్తానని పట్టుబట్టి కూర్చున్నారు.

వీరవాసరం గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు మోకాళ్ల చిప్పలు అరిగిపోవడంతో నడవలేకపోతున్నారు. ఆటోలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగేశ్వరరావు.. డ్యూటీలో ఉన్న సిబ్బంది సాయంతో పోలింగ్ కేంద్ర లోపలికి వెళ్లారు. లోక్ సభ స్థానానికి తానే స్వయంగా ఓటు వేసుకున్నారట. అయితే, అసెంబ్లీ స్థానానికి ఓటు వేసేటప్పుడు అక్కడున్న ఎన్నికల అధికారి సాయం కోరారట. అయితే, తాను గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెబుతుంటే.. ఆ అధికారి తన చేయి పట్టుకుని బలవంతంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించారని నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు.

తన ఓటు తనకు కావాల్సిందేనని పట్టుబట్టాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు, సిబ్బందికి అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇలాంటి సిత్రాలెన్నో రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.