Current Date: 26 Nov, 2024

కడప రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డా అది. గడప గడప ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న కడప అది. ఏనాడూ వైఎస్ కుటుంబం ఈ గడప నుంచి ఓడిన దాఖలాల్లేవు. ముందు వైఎస్ఆర్‌కు తరువాత వైఎస్ జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రాంతమిది. సరిగ్గా ఐదేళ్లుకు ఇప్పటికి కడప రాజకీయమే మారిపోయింది. ఐదేళ్ల క్రితం అంటే 2019 ఎన్నికల్లో అన్న విడిచిన బాణంగా, అన్న తరపున ప్రచారం చేసి అంతా తానేగా నిలిచిన చెల్లెల్లు షర్మిల ఇప్పుడు ప్రధాన ప్రత్యర్ధిగా మారింది.

గత ఎన్నికల్లో కడప అసెంబ్లీ బరిలో సొంత అన్నయ్య వైఎస్ జగన్‌కు మద్దతుగా, కడప పార్లమెంట్ బరిలో కజిన్ అవినాష్ రెడ్డికి ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ప్రత్యర్ధిగా ఇద్దరు సోదరులకు సవాలు విసురుతోంది. కుటుంబపరమైన కారణాలతో అన్నతో విబేధించిన వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్నపై ఆరోపణలు సంధిస్తోంది. ఏ పార్టీకు వ్యతిరేకంగా బయటికొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారో అదే పార్టీ పగ్గాలు ఇప్పుడు షర్మిల చేపడుతోంది.

అంతేకాదు కడప పార్లమెంట్ బరిలో సోదరుడు అవినాష్ రెడ్డికి సవాలు విసురుతోంది. వైఎస్ఆర్ బిడ్డగా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండటం అత్యంత ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలో గత ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

2019 ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డికి 7,83,499 ఓట్లు పడితే తెలుగుదేశం అభ్యర్ది ఆదినారాయణ రెడ్డికి 4,02,773 ఓట్లు పోలయ్యాయి. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జి శ్రీరాములుకు కేవలం 8,341 ఓట్లు పడ్డాయి. విశేషమేంటంటే ఆ ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు 14, 692 ఓట్లు. అంటే కాంగ్రెస్ అభ్యర్ధి కంటే ఎక్కువ.

ఇక పర్సెంటేజ్ పరంగా చూస్తే అవినాష్ రెడ్డికి 49.89 శాతం ఓట్లు వస్తే ఆదినారాయణ రెడ్డికి  25.65 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు కేవలం 0.53 శాతం ఓట్లే వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ బిడ్డగా, ఆ గడపకే చెందిన వైఎస్ షర్మిల బరిలో ఉన్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వైఎస్ షర్మిలకు కడప గడ్డపై ఉన్న అవకాశాలపై సర్వే చేయిస్తే 55 శాతం అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే వైఎస్ జగన్‌కు ఇది షాకింగ్ పరిణామం. వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదు.

బాబాయ్‌ని హత్య చేసినోడు కావాలా, వైఎస్ఆర్ బిడ్డ కావాలా తేల్చుకోమంటూ వైఎస్ షర్మిల ప్రజలకు పిలుపునిస్తోంది. 2019 ఎన్నికలకు కేవలం  రెండు నెలల ముందు వైఎస్ జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకు వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ అనుమానాలు, పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి హస్తముందనే వాదన గట్టిగానే విన్పిస్తోంది. ఇప్పుడీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నోటి నుంచి బాబాయ్ హత్య చేసినోడా లేక వైఎస్ఆర్ బిడ్డనా అనే మాట రావడం కడప ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే కడప ప్రజలు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంతగా అభిమానిస్తారో వివేకానందరెడ్డినీ అంతే అభిమానిస్తారు. అందుకే ఇప్పుడు వైఎస్ షర్మిల బరిలో ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు మింగుడుపడటం లేదు.

కడప ప్రజానీకం ఎవరిని ఆదరిస్తుందో తెలియదు కానీ, వివేకానందరెడ్డి హత్యానంతర పరిణామాలు, వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల బరిలో ఉండటం కచ్చితంగా ప్రజల్ని ఆలోచింపచేయవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా వైఎస్ జగన్‌ను, ఎంపీగా షర్మిలను అందలమెక్కించినా ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు.