తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ తన నోటి దురుసుతో వార్తల్లోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, తమ కుటుంబ అజాత శత్రువు అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇకపై తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడ్తామని ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించాడు. నిజానికి జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి పెద్ద దండయాత్రగా వెళ్లగా ఇప్పుడు జేసీ రివేంజ్ తీర్చుకునే పనిలో ఉన్నారు. జేసీ ఆశించినట్లు అతని కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి అధికారంలో వుంది. ఇక అడ్డేముంది అన్నట్లు జేసీ చెలరేగిపోతున్నారు. ఇటీవల రవాణాశాఖ అధికారులపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో జేసీ ట్రావెల్స్‌పై రవాణ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. వైసీపీలో తనకు నలుగురైదుగురు శత్రువులు ఉన్నారని. వారిపై చట్టపరంగా చర్యలకి వెళ్తానని జేసీ వార్నింగ్ ఇచ్చారు. గెలిచినా ఓడినా ఫ్యాక్షన్ చేస్తానని గతంలో కేతిరెడ్డి అన్నారని, ఆయన వల్ల తనకు ప్రాణహాని పొంచి వుందన్నారు జేసీ. అందుకే కేతిరెడ్డిని, ఆయన ఇద్దరు కుమారులను ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే బహిష్కరించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Share