Current Date: 07 Oct, 2024

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్.. బీసీసీఐ ప్రకటన

భారత క్రికెట్ జట్టుకి కొత్త కోచ్ వచ్చేశాడు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ‘భారత క్రికెట్ జట్టుకి కొత్త ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌ని స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కెరీర్‌లో ఎన్నో కష్టాలను తట్టుకుని రాణించిన గౌతం గంభీర్ భారత క్రికెట్‌ను ముందుకు నడిపించే పాత్రకు తగిన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది’ అని బీసీసీఐ కార్యదర్శి జైషా అధికారికంగా ప్రకటించారు.మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. జూలై నెలాఖరులో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్‌ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే ప్రకటించారు. ఇంటర్వ్యూ కొన్ని రోజుల కిందటే పూర్తయ్యింది.టీమిండియా మాజీ ఓపెనర్‌గా గంభీర్‌కు విశేషమైన అనుభవం ఉంది. అంతేకాకుండా 2011 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ జట్టులో సభ్యుడు కూడా. ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా రెండుసార్లు టైటిల్ అందించాడు. 

Share