వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రియాంక ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. రౌండ్ రౌండ్ కు భారీ ఆధిక్యాన్ని కనబర్చిన ఆమె 4,04,619 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీకి మొత్తం 6,12,020 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరీ నిలిచారు. ఆయనకు 2,07,401 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె 1,08,940 ఓట్లు సాధించారు. తాజా ఫలితాలను బట్టి చూస్తుంటే వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీకి బ్రహ్మరథం పట్టారు. గత సార్వత్రి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.