పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో కాంస్య పతకం దక్కింది. 57 కేజీల పురుషుల రెజ్లింగ్ విభాగంలో పోటీపడిన అమన్ సెహ్రావత్ ప్యూర్టోరికా రెజ్లర్ డారియన్ క్రజ్‌పై 13-5 తేడా విజయం సాధించి భారత్‌కి పతకాన్ని అందించాడు. దాంతో భారత్ ఖాతాలో మొత్తం 6 ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి. వినేశ్ ఫొగాట్ నిష్క్రమణ తర్వాత రెజ్లింగ్‌లో ఒక్క పతకం కూడా లేకపోవడంతో భారత్ ఆశలన్నీ 21 ఏళ్ల అమన్‌పైనే పెట్టుకుంది. దీంతో పతక పోరులో అతడు మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. తొలి పీరియడ్‌లో ప్రత్యర్థి డారియన్ క్రజ్ మూడు పాయింట్లు పొందగా, అమన్ 6 పాయింట్లతో ముందంజ వేశాడు. ఇక రెండో భాగంలో అమన్ ఏకంగా ఏడు పాయింట్లతో తిరుగులేని విజయం నమోదు చేశాడు. భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ అందుకున్న పిన్న వయస్కుడిగా అమన్ చరిత్రకెక్కాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో పతకం.