తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపం దాటికి ద్వీపం మొత్తం కంపించింది. తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ ‘భూకంప పర్యవేక్షణ సంస్థ’ ప్రకంపనల తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 7.2గా గుర్తించగా.. ‘అమెరికా జియోలాజికల్ సర్వే’ దీన్ని 7.4గా పేర్కొంది. తైవాన్‌లోని హువాలియెన్ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడిరచింది. భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హువాలియెన్ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడం చిత్రాల్లో కనిపిస్తోంది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, తైవాన్ భూకంపం నేపథ్యంలో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. జపాన్‌లోని యోనుగుని ద్వీపానికి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా, జపాన్‌లోని ఒకినావా ప్రిఫెక్చర్‌లోని (రాష్ట్రం) తీర ప్రాంతాలకు జపాన్ మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి కోస్తాతీరంలో సముద్రం అలలు 3 మీటర్ల ఎత్తువరకూ ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేయడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే, పరిస్థితి పరిశీలించిన అనంతరం, జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. సహాయక చర్యల సన్నద్ధతను సమీక్షించాయి. ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అల యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడిరచింది. ఒకినావాతో పాటు కగోషిమా ప్రాంతాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. అయితే, తమకు ఎటువంటి సునామీ ప్రమాదం ఉండకపోవచ్చని చైనా భావిస్తోంది. రెండు భూఫలకాల సరిహద్దులో తైవాన్ ఉండటంతో అక్కడ నిత్యం భూకంపాలు సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
గత 25 ఏళ్లలో..
తైవాన్‌లో ఈ స్థాయి భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. 1999లో నాంటో కౌంటీలో సంభవించిన భూకంపం (7.2 తీవ్రత) కారణంగా 2, 500 మంది మరణించగా మరో 1,500 మంది గాయపడ్డారు. 1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.