అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ ఎగువ గుడ్డి గ్రామంలో 12కుటుంబాల్లో 70మంది గిరిజనులు నివసిస్తున్నారు. తాగునీటి కోసం వారంతా కి.మీ దూరం నడిచి పెద్ద గెడ్డ నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. వేసవి నేపథ్యంలో నీరు దొరక్క మనుషులే కాదు..పశుపక్ష్యాదులూ అల్లాడిపోతున్నాయి. చెలమల్లో నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అదే విధంగా ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే విజయనగరం జిల్లా మెంటాడ మండలం వరకు తీసుకెళ్లాల్సిందే. రూ.కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేసినా సకాలంలో అవి పూర్తికాక, గుంతలేర్పడి అంబులెన్స్‌లు సైతం నడవలేని పరిస్థితి ఆయా గ్రామాల్లో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో మూడు కుళాయిలకు కనెక్షన్లిచ్చారు. అయితే వాటిల్లో నీరు మాత్రం రావడం లేదు. దీంతో ఆదివాసీ గిరిజనులతంతా ఈ కుళాయిల వద్ద చేతులు జోడిరచి తమకు తాగునీరందేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవోనూ వేడుకుంటున్నారు. ఖాళీ బిందెలు నెత్తిపై పెట్టుకుని గుక్కెడు మంచినీళ్లివ్వండంటూ విజ్ఞప్తి చేశారు. తమకు మంచి నీటి సౌకర్యం కల్పించకపోతే పంచాయతీ సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని రొంపల్లి పంచాయతీ 10వ వార్డు సభ్యుడు సోమిల అప్పలరాజు. గిరిజన రైతు సహకార సంఘ నాయకులు కోనపర్తి సింహాచలం, కోటపర్తి సన్యాసిరావు, పొట్టంగి సన్యాసమ్మ గ్రామ మహిళలు హెచ్చరించారు.