Current Date: 04 Jul, 2024

వైజాగ్‌లో ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఎవరూ బ్రేక్ చేయలేరు!

విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. కీపింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన ధోనీ టీ20 క్రికెట్ చరిత్రలో 300 వికెట్లలో భాగస్వామ్యమైన వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్ పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ధోనీకి దరిదాపుల్లో కూడా ప్రస్తుత వికెట్ కీపర్లు ఎవరూ లేరు. దాంతో చిరస్థాయిగా ధోనీ పేరిట ఈ రికార్డ్ నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ధోనీ(300) తర్వాత స్థానంలో కమ్రాన్ అక్మల్(274 వికెట్లలో భాగస్వామ్యం, పాకిస్థాన్), దినేశ్ కార్తీక్(274) సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత క్వింటన్ డికాక్(270, దక్షిణాఫ్రికా), జోస్ బట్లర్(209, ఇంగ్లాండ్) టాప్-4లో ఉన్నారు. కానీ.. ఇందులో కమ్రాన్ అక్మల్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా.. దినేశ్ కార్తీక్, డికాక్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. బట్లర్ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా చేయడం లేదు. దాంతో ధోని రికార్డ్ బద్దలు అవ్వడం కష్టమే!