Current Date: 26 Nov, 2024

మోసపోయిన అదానీ గంగవరం పోర్టు నిర్వాసితులు

అదానీ గంగవరం పోర్టు నిర్వాసితులు మళ్ళీ మోసపోయారు. భూములు, ఉపాధి పోగొట్టుకున్న నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం అదానీతో చేతులు కలిపి వారిని నట్టేట ముంచేసింది. వైసీపీ పార్టీ ఏజెంటుగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్‌ ఏ.మల్లికార్జున నేతృత్వంలో గురువారం జరిగిన చర్చల్లో కూడా అదానీకే మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. పద్నాలుగేళ్ళ క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. న్యాయబద్ధంగా కార్మికులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇప్పటికీ అమలు కావడం లేదు. అదానీ మెడలు వంచి కార్మికుల శ్రేయస్సును చూడాల్సిన కలెక్టర్‌ మల్లికార్జున అదానీకి మాత్రం మేలు చేకూర్చే నిర్ణయాలు చేసి వారిని నిలువునా ముంచేశారు. గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో దిబ్బపాలెం గ్రామం పూర్తిగా పోయింది. ఈ గ్రామంలోవున్న 300 మందికి పునరావాసం కింద ఇళ్ళ స్థలం, ఇళ్ళ నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 44,500 రూపాయలు, గంగవరం పోర్టులో ఉద్యోగం అంటూ అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ యిచ్చింది. అలాగే గంగవరం గ్రామస్తులకు చేపల వేట ప్రధానమైన ఉపాధి. గంగవరం పోర్టు వల్ల వీరు చేపల వేటకు వెళ్ళడానికి వీలులేదని ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల వీరందికీ గంగవరం పోర్టులో ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధంగా గంగవరం మత్స్యకారులు, దిబ్బపాలెం గ్రామస్తులు కలిసి మొత్తం 600 మందికి గంగవరం పోర్టులో ఉద్యోగం కల్పించారు. కానీ ఆ ఉద్యోగానికి జీతం ఎంత ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించలేదు గనుక నెలకు 5వేల నుంచి 9వేల రూపాయల వరకూ మాత్రమే గంగవరం పోర్టు యాజమాన్యం చెల్లించేది. అయితే ఎప్పటికైనా జీతాలు పెరుగుతాయనే ఆశతో కార్మికులందరూ పని చేశారు. ఒక ఉద్యోగస్తునికి ఇవ్వాల్సిన ఎటువంటి ఇతర సౌకర్యాలూ కల్పించకపోయినా భరించారు. ప్రభుత్వ భాగస్వామ్యం కూడా గంగవరం పోర్టులో వున్నందువల్ల ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. వాస్తవానికి వీరికి కనీస వేతనం అమలుచేస్తే ఒక్కొక్కరికి 36వేల రూపాయల వరకూ నెలసరి జీతం ఇవ్వాల్సివుంది. కానీ వీళ్ళకు ఇప్పుడు గరిష్ఠంగా నెలకు 16వేల రూపాయలు మాత్రం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గత ఏడాది తమ న్యాయమైన హక్కులను అమలు చేయాలంటూ రెండు నెలలపాటు సమ్మె చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌, జిల్లా కలెక్టర్‌ ఏ.మల్లికార్జున  కార్మిక నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి 1500 రూపాయల ఇంక్రిమెంటు,  సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి పదివేల రూపాయల చొప్పున ఇప్పిస్తామని, సస్పెండ్‌ అయిన వాళ్ళకు ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకుంటామని వంటి నిర్ణయాలతో వారిచేత సమ్మెను విరమింపజేశారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ప్రతినిధి లేకపోవడం ఒక తప్పిదమైతే అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం నుంచి కూడా ఎవరూ లేకపోవడం గమనించాల్సిన విషయం. అయితే ఈ నిర్ణయాలు అమలుకాకపోవడంతో గత 37 రోజుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ కార్మికులు, వీరితోపాటు రెగ్యులర్‌ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అయినప్పటికీ కలెక్టర్‌ మల్లికార్జునకుగాని, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కుగాని మొహం చెల్లక వారితో సంప్రదింపులకు పూనుకోలేదు. ఇదే సమయంలో విశాఖ ఉక్కు ముడి సరుకు రవాణా ఆగిపోయిందని, దీనివల్ల ఉక్కు తీవ్రమైన ఇబ్బందుల్లో పడిరదని, ఈ గండం నుంచి గట్టెక్కించాలని ఉక్కు అధికారుల సంఘం నేత కేవీడీ ప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్‌, పోలీసు కమీషనర్‌ జోక్యం చేసుకొని ఉక్కుకు కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బొగ్గును అందించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా కలెక్టర్‌ మల్లికార్జున ముందుకు రాలేదు. దీనిపై హైకోర్టులో కలెక్టర్‌, సీపీ, పోర్టు సీఈవోలపై కోర్టు ధిక్కారం కేసు కూడా నమోదయింది. అప్పటికీ కలెక్టర్‌ నానుస్తూ ఎన్నికలు అయ్యేంతవరకూ కథను కొనసాగించారు. మధ్యలో పోలీసు కమీషనర్‌ జరిపిన చర్యల్లో కార్మికులు తమకు 35 లక్షల చొప్పున ఇచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వెళ్ళిపోతాం అని కార్మికులు స్పష్టం చేశారు. అదానీ చేత ఈ మొత్తానికి అంగీకరింపజేయడంలో కలెక్టర్‌ మల్లికార్జున విఫల మయ్యారు. ఇప్పుడు తాజాగా చర్చలు జరిపి 27లక్షల రూపాయలు తీసుకొని బయటకు వెళ్ళిపోయేలా కార్మికుల్ని బలవంతంగా ఒప్పించారు. దీనికి దాదాపు వందమంది కార్మికులు అంగీకరించలేదు. అయినా బలవంతం చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. ఈ విధంగా అడుగడుగునా గంగవరం నిర్వాసితుల్ని దగా చేస్తూనే వున్నారు.


మాకు స్వచ్ఛంద పదవీ విరమణ వద్దు
ఎదురు తిరిగిన కార్మికులు..
స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని వెళ్ళిపోవడానికి దాదాపు వందమంది కార్మికులు అంగీకరించలేదు. 27 లక్షల రూపాయలు 45 రోజుల తర్వాత కార్మికులకు ఇవ్వడానికి కలెక్టర్‌ మల్లికార్జున నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు వంద మంది కార్మికులు తాము ఉద్యోగంలో కొనసాగుతామని, తమకు స్వచ్ఛంద పదవీ విరమణ వద్దు అంటూ ప్రకటించారు. అయితే గంగవరం పోర్టు యాజమాన్యం ఈ రోజు కార్మికుల్ని లోనికి రానివ్వలేదు. దీంతో వీళ్ళు గేటు బయటే వుండిపోయారు.