సోషల్ మీడియా అతివినియోగం, క్షణికావేశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఉంగుటూరు మండలానికి చెందిన చిన మావుళ్లయ్య అనే యువకుడికి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇర్రి రమ అనే వివాహితతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న రమ, చిన మావుళ్లయ్యతో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని, ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకోవడం ఈ గొడవకు బీజం వేసింది. ఈ విషయం రమ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు యర్రమళ్ల వచ్చి యువకుడి కుటుంబంతో గొడవకు దిగారు. అనంతరం రమను బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లిపోయారు. అయితే, ఈ నెల 24న రమ మళ్లీ తిరిగి రావడంతో, తన అన్న కుమారుడికి సమాచారం అందించిన మావుళ్లయ్య, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కాలువ గట్టున వారి వస్తువులు లభ్యం కావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలింపు చర్యల తర్వాత ఇద్దరి మృతదేహాలు కాలువలో వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయి. కేవలం ఇన్స్టాగ్రామ్ పరిచయం ప్రాతిపదికన తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం కారణంగా, ఇటు ఒక తల్లికి కొడుకు దూరమవ్వగా, అటు ఇద్దరు పసిపిల్లలు తల్లి లేని అనాథలయ్యారు. సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల అవగాహన లేకపోవడం, కుటుంబ బంధాల కంటే క్షణికావేశానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ ప్రాణాలు గాలిలో కలిశాయి.
Share