ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, పలకల క్వారీ వద్ద మలుపు తిరుగుతుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక భాగంలో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోవడంతో సుమారు 10 మంది సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో ఉన్న మరో 10 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులంతా కనిగిరి ప్రాంతానికి చెందిన వారు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.