భారీ అంచనాల మధ్య విడుదలైన పవన్ కల్యాణ్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్', బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత చిత్రం 'ఓజీ' రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసినప్పటికీ, ఈ సినిమా కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. వారం రోజులు గడిచినా కనీసం వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 89 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. రెండో రోజు నుంచే డిస్కౌంట్ పాస్‌లు అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో ఆక్యుపెన్సీ పెరగలేదు. ఇండియాలో కేవలం 77 కోట్ల రూపాయల గ్రాస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాపై ముందు నుంచి సరైన బజ్ లేకపోవడం, విడుదలైంది మొదలు నెగెటివ్ టాక్ రావడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో సుదీర్ఘ కాలం పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం, చివరకు నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, కథాబలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ సంబరం వారానికే ముగిసింది.
Share