Current Date: 26 Nov, 2024

కంట్రోల్‌ తప్పిన డ్రగ్‌ కంట్రోలర్‌

లంచం వసూలు చేయడానికి ఒక ప్రత్యేకమైన సంఘం ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. విశాఖ మహానగరంలో అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ తనకు ఇవ్వాల్సిన లంచాలను వసూలు చేయడానికి హోల్‌సేల్‌ మెడికల్‌ వ్యాపారుల సంఘానికే అధికారమిచ్చేశారు. ఈ సంఘమే సారువారికి ఇవ్వాల్సిన లంచాలను వసూలు చేస్తోంది. పది నెలల క్రితం విశాఖలో పోస్టింగ్‌ వేయించుకొడాని ఈ అధికారి కోటి రూపాయలు లంచం ఇచ్చాడట. విశాఖ ఇన్‌ఛార్జి మంత్రి కూడా అయిన ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి ఈ మొత్తాన్ని చెల్లించి ఎస్‌.విజయ్‌ కుమార్‌ అనే ఈ అధికారి విశాఖ ఏడీసీగా పోస్టింగ్‌ వేయించుకున్నారట. అప్పటి నుంచి విశాఖ హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులకు, మందుల షాపు యజమానులకూ ఇక్కట్లు మొదలయ్యాయి. తాను లంచంగా ఇచ్చుకున్న సొమ్మును హోల్‌సేల్‌ మెడికల్‌ షాపుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని అసోసియేషన్‌ నాయకులకు సదరు విజయ్‌కుమార్‌ హుకుం జారీ చేశారట. లంచాలను కాజేయడంలో ఇప్పటికే ఆరితేరిన విజయ్‌కుమార్‌ అంటే అందరికీ హడల్‌ అంట. ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికిస్తాడని భయమట. అందులోనూ ఈ అధికారికి సూటుకేసుల విజయ్‌కుమార్‌ అనే పేరు వుండనే వుందట. రెండుసార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయిన అనుభవం కూడా ఈ విజయకుమార్‌కు వుందట. అయినప్పటికీ విశాఖ వంటి మహానగరంలో మంత్రి విడదల రజనిని పట్టుకొని పోస్టింగ్‌ వేయించుకున్నాడాంటే నిజంగా మరి ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉన్నట్టు లెక్క అని సంఘ నాయకులకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. దీంతో విజయకుమార్‌ చెప్పిందల్లా చేయడానికి సంఘం సిద్ధమైపోయింది. దీంతో విజయకుమార్‌ సంఘానికి ఒక టార్గెట్‌ ఇచ్చి పారేశారు. ఒక్కో హోల్‌సేల్‌ మందుల షాపు నుంచి 20 వేల రూపాయలు చొప్పున వసూలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని మొత్తం 200 షాపులు నుంచి అక్షరాలా 40లక్ష రూపాయలు ఈ సంఘం నాయకులు వసూలు చేసి సదరు విజయ్‌కుమార్‌కు సమర్పించారట. అంతటితో ఊరుకోలేదు. జిల్లాలో వున్న 1200 మెడికల్‌ షాపులకూ టార్గెట్‌ పెట్టారు. అయితే వీరికి 50 శాతం డిస్కౌంట్‌ ఇచ్చి కేవలం పది వేల రూపాయలు చొప్పున మాత్రమే అడిగారట. అంటే కోటి ఇరవై లక్షల రూపాయల కలెక్షన్‌కు టార్గెట్‌ అన్న మాట. ఇది వసూలైయితే విడుదల రజనికి ఇచ్చిన సొమ్ము మొత్తం వెనక్కు వచ్చేయడమే కాకుండా విజయ్‌కుమార్‌ సార్‌ హ్యాపీగా వుండేంత సొమ్ము కూడా వచ్చి పడిపోతుందన్నది ఆలోచన. అయితే మెడికల్‌ షాపు యజమానులు మాత్రం ఈ .. పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో విజయ్‌ కుమార్‌ సార్‌ మందుల షాప్‌ల యజమానులపై తెగ సీరియస్‌గా వున్నారట.  ఈ కథ ఇంతటితో ఆగలేదు. కొత్త మందుల షాపు పెట్టాలంటే 30 వేల రూపాయలు అసోసియేషన్‌ ద్వారా విజయ్‌కుమార్‌కు చెల్లించుకోవాలట. రెన్యువల్‌కి 10 వేల రూపాయలు ఇవ్వాలట. ఇలాగ డ్రగ్‌ కంట్రోలు కార్యాలయాన్ని ప్రసన్న చేసు కోవాలంటే సంఘ నాయకుల ద్వారా డబ్బు చెల్లించాల్సిందేనట. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఇక్కడి ఏడీసీపై చర్య తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.