Current Date: 06 Jul, 2024

Double guarantee to owner with Land Titling Act - CM Jagan

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గత కొద్దిరోజుల్నించి ల్యాట్ టైట్లింగ్ చట్టంపై చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టదల్చుకున్న ఈ చట్టాన్ని ఎన్నికల్లో అస్త్రంగా ప్రతిపక్షాలు మల్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై స్పష్టత ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ చట్టం అధికార పార్టీని ఇరుకునపెట్టేలా కన్పిస్తోంది. ప్రతిపక్షాలు ఈ అస్త్రంతో ప్రజల్లో వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి వివరించారు.

ల్యాండ్ టైట్లింగ్ చట్టం అంటే భూమి హక్కులు లాక్కోవడం కానేకాదన్నారు. పైపెచ్చు భూ యజమానికి అతని భూమిపై డబుల్ గ్యారంటీ ఇచ్చే చట్టమన్నారు. అంటే భూ యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టమని తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జిరాక్స్ పేపర్లు ఇస్తారనేది పూర్తిగా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారమన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆ భూమి యజమానివద్దే ఉంటాయన్నారు. భూములకు సంబంధించి ఇదొక సంస్కరణగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ఏ విధంగా చదువు, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, హౌసింగ్ విషయాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామో ఇది కూడా అలాంటిదేనన్నారు.

ఎప్పుడో వందేళ్ల క్రితం భూములకు సర్వే జరిగిందని, తిరిగి ఇప్పుడు తాము జరిపిస్తున్నామన్నారు. ఇది కేవలం ఏపీకు పరిమితమైంది కాదని దేశం మొత్తానికి వర్తిస్తుందన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఆయోగ్ లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రస్తావించాయన్నారు. ఇప్పటికే 17 వేల గ్రామాల్లో రికార్డుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. భూమిపై ఆ యజమానికి ఉండే యాజమాన్య హక్కుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ అన్నారు. ఎక్కడైనా ఏదైనా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఫేక్ టైటిల్ అని ఎవరైనా క్లెయిమ్ చేస్తే సరైందేనని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని వైఎస్ జగన్ చెప్పారు.