బాలీవుడ్ నటి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన కంగనా రనౌత్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. తనకి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు.. ఆధార్ కార్డులు తీసుకురావాలని ఆమె తాజాగా పెట్టిన ఓ సరికొత్త నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కంగనా రనౌత్ పెట్టిన వింత కండీషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఆధార్ కార్డు ఎందుకు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వారు ఎందుకు తనను కలవాలి అనుకుంటున్నారో ఆ కారణాన్ని కూడా పేపర్‌పై రాసి ఇవ్వాలని కంగనా అనడంపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్‌పై.. కంగనా రనౌత్ విజయం సాధించారు. అయితే అంతకుముందే 2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విక్రమాదిత్య సింగ్.. ప్రస్తుతం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.