Current Date: 05 Oct, 2024

కలెక్టర్ మల్లికార్జున దోపిడీ సొమ్ముతో బెంగళూరులో స్థలాలు

విశాఖ జిల్లాలో చేసిన భూదందాల సొమ్ముతో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున బెంగళూరులోని నంది హిల్స్‌లో భారీగా స్థలాలు కొన్నట్లు తెలిసింది. విశాఖలోని ముదపాక ల్యాండ్‌ పూలింగ్‌ భూముల్లో భారీ స్కాం జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు హైకోర్టును తప్పు దోవ పట్టించి అక్కడి దళిత రైతుల భూముల్ని అడ్డంగా దోచుకోవడంలో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ప్రధాన పాత్ర పోషించారు. దళారి జలవిహార్‌ రామరాజుకు దళితులు తమ భూమిని కారు చౌకగా ఇస్తానంటేనే కలెక్టర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ ఓనర్‌ షిప్‌ సర్టిఫికెట్లను ఇవ్వడం ద్వారా దళితులకు తీవ్ర ద్రోహాన్ని తల పెట్టాడు. ఈ విషయాన్ని పత్రికల ద్వారా ధర్నాలు ద్వారా దళితులు వెలుగులోకి తెచ్చినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అండదండలు చూసుకుని మల్లికార్జున దళారులతో చేతులు కలిపి దళితుల భూముల్ని కాజేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయాలని అనేక ప్రజా సంఘాలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేసాయి. అది లా ఉంటే ఆనందపురం భీమిలిమండలాల్లో దళితుల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో కూడా కలెక్టర్‌ మల్లికార్జున కీలకపాత్ర వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో కూడా కోట్లాది రూపాయల విలువైన భూముల్ని దళారీలకు కట్టబట్టేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ మల్లికార్జున దోపిడీపై చేసిన భూములన్ని కేవలం ఒక తలారి పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ జరగడం చూస్తుంటే తన అధికారాన్ని కలెక్టర్‌ ఏ విధంగా దుర్వినియోగం చేశారు అర్థం చేసుకోవచ్చు. అడ్డు అదుపు లేని అధికారలతో విశాఖలోని భూముల దందాలో కలెక్టర్‌ మల్లికార్జున కీలకపాత్ర పోషించారు. అంతేకాదు తను చెప్పినట్లు అక్రమాలు చేయకపోవడంతో పెందుర్తి భీమునిపట్నం ఆనందపురం చనగదిలి మండలాల తహసీల్దారులను కూడా బదిలీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తన మాట వినలేదని రాత్రికి రాత్రే జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ ను బదిలీ చేయించారు. వీటన్నిటిపై కలెక్టర్‌ మల్లికార్జున పై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి