సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అవకాశమున్న ఏ దారిని సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టకుండా.. అమాయకులను మోసం చేస్తూ దొరికినకాడికి దోచేస్తున్నారు. రోజుకో తరహా కొత్త మోసాలు బయటపడుతున్నాయి. సులభంగా డబ్బు సంపాధించాలన్న సామాన్యుల ఆశనే అసరాగా తీసుకుని.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.దేశాన్ని రక్షించే ఆర్మీ అధికారుల పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్మీ అధికారులమంటూ సామాన్యులకు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. తనకు తెలిసిన ఒకరికి. 7015591204 అనే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు.అటు నుంచి మాట్లాడిన వ్యక్తి.. తాను ఇండియన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ అధికారినంటూ పరిచయం చేసుకున్నట్టు తెలిపారు.బాధితున్ని సులువుగా నమ్మించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆర్మీ అధికారులు తీసుకున్న ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నట్టు తెలిపారు.